Avata 2 : దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలు అందుకుని మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ విజువల్ వండర్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి పెద్దాపురంలోని ఓ థియేటర్‌లో అవతార్ 2 చిత్రాన్ని చూసేందుకు వెళ్లాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న సోదరుడు అతడిని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటననే జరిగింది. 2010లో అవతార్ ఫస్ట్ పార్ట్ చూస్తున్నప్పుడు తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఆ వ్యక్తికి హైబీపీ ఉంది. సినిమా చూస్తూ ఉద్రేకానికి గురైన కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు.