తిరుపతి బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథ పిల్లలను హీరో మంచు విష్ణు (Manchu Vishnu) దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏడాదిన్నర క్రితమే 120 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాను అని తెలిపారు. పండుగలన్నీ వారితో కలిసి ఆనందంగా చేసుకుంటున్నానని.. ఈ విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని అనుకోలేదన్నారు. కానీ ఇలాంటివి ప్రపంచానికి తెలియాలని ఇప్పుడు అనిపించిందని.. మీరు కూడా ఇలాంటి పనులు చేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
భోగి పండుగను ఆ పిల్లలతో కలిసి ఎంతో ఉత్సాహంగా చేసుకున్నానని.. ఆ పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్లి మరికొందరికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగను మోహన్ బాబు కుటుంబసభ్యులు చంద్రగిరి మండలంలోని ఏఎంబీ(AMB) యూనివర్సిటీలో చేసుకుంటున్న విషయం విధితమే.