Manchu Vishnu : హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ తగ్గించే పేరుతో కొన్ని సంస్కరణలు చేపట్టారు. కొన్ని దార్లు మూసేసి, కొన్ని యూ టర్న్స్ బ్లాక్ చేసి, కొన్ని రూట్స్ మార్చి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ట్రాఫిక్ తగ్గడం మాటేమో గాని యూ టర్న్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సొస్తుంది. సాధారణ వాహన దారులకి టైం, పెట్రోల్ రెండూ వేస్ట్ అవుతున్నాయి. చాలా మంది ప్రజలు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులని విమర్శిస్తున్నారు.
కొంచెం దూరానికి కూడా జూబ్లీహిల్స్ చుట్టూ వాహనదారులు కిలోమీటర్ల కొద్దీ ప్రదక్షణలు చేయాల్సి వస్తుంది. తాజాగా ఈ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై మంచు విష్ణు ట్వీట్ చేశాడు. విష్ణు తన ట్వీట్ లో.. ” జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకమైన ట్రాఫిక్ వ్యవస్థను రూపొందించినందుకు హైదరాబాద్ పోలీసులకు నా అభినందనలు. దీనివల్ల నా ఇంటి నుండి ఆఫీసుకి ప్రయాణ సమయం సాయంత్రం పూట 20 నిమిషాలు తగ్గింది. ముఖ్యంగా కమిషనర్ సివి ఆనంద్ గారికి ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన” అంటూ పోస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకి ట్యాగ్ చేశాడు.
అయితే ప్రజలంతా ఆ ట్రాఫిక్ డైవర్షన్ ని తిట్టుకుంటుంటే మంచు విష్ణు బాగుందంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు విష్ణుని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగానే ఏ చిన్న విషయంలో దొరికినా మీమర్స్, నెటిజన్లు మంచు విష్ణుని ఆడేసుకుంటారు. ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడంతో.. యూటర్న్స్ బ్లాక్ చేస్తే నీకు మంచిదా, మా పెట్రోల్ మొత్తం అయిపోతుంది. జూబ్లీ హిల్స్ చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఎక్కడ తగ్గింది అంటూ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు మరోసారి ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చాడు.