Devi sri Prasad talks about Kodi Ramakrishna:కోడి రామకృష్ణ అనగానే భారీ గ్రాఫిక్స్, ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన గురువు దాసరి నారాయణరావు నుంచి నేర్చుకున్న పాఠాలతో.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడంలో ఆరితేరిన దర్శకుడు ఆయన. ముఖ్యంగా “అమ్మోరు”, “అంజి”, “అరుంధతి” వంటి ఫాంటసీ, పౌరాణిక చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడమే ఆయన గొప్పతనం. అలాంటి కోడి రామకృష్ణ గురించి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి ప్రసాద్ ప్రస్తావించారు. కోడి రామకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
50 సినిమాలు పూర్తి చేసినా చిన్న కార్లోనే..ఒకానొక సమయంలో తెలుగు సినిమాలను పరిగెత్తించిన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ . టాలీవుడ్ లో రాఘవేంద్రరావు .. దాసరి నారాయణరావు తరువాత కనిపించే పేరు ఆయనదే. 100కు పైగా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకి మంచి పేరు వుంది. అలాంటి కోడి రామకృష్ణ గురించి సంగీత దర్శకుడు దేవి ప్రసాద్ పలు విషయాలను ప్రస్తావించారు. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే సమయానికి కూడా ఒక చిన్న పాత కార్లో తిరుగుతూ ఉండేవారని అన్నారు.
” నేను కోడి రామకృష్ణగారి శిష్యుడిని … ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులోనే పనిచేశాను. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే సమయానికి కూడా ఒక చిన్న పాత కార్లో తిరుగుతూ ఉండేవారు. అప్పటికే ఆయన చాలా గొప్ప దర్శకుడిగా ఎదిగారు. ఒకసారి ఒకాయన ఆయనతో “ఏంటి సార్ .. మీరు ఎన్నో హిట్స్ ఇచ్చినా.. ఇంత పాత కారులో తిరుగుతున్నారు? ఒకటి రెండు హిట్స్ ఇచ్చిన వాళ్లు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు .. కారు మార్చండి సార్ ” అని అన్నాడు.
అందుకు కోడి రామకృష్ణ స్పందిస్తూ .. “కారు కొనడం పెద్ద విషయం కాదు. కొన్న తరువాత మన జీవితం దానికి అలవాటు అవుతుంది. దానికి తగ్గట్టుగానే మనం ఆదాయం ఉండాలి. ఇక ఈ రోజు నుంచి మనకి రూపాయి రాదు అనే పరిస్థితి వచ్చినా… మనం కారును కంటిన్యూ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే కారు కొనాలి. రేపటి రోజున మనకు కారు లేకపోతే లగ్జరీకి అలవాటు పడిన మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. నేలమీద నడిస్తే పడిపోవడానికి తక్కువ అవకాశం .. నాకు నేల మీద నడవడమే ఇష్టం” అని కోడి రామకృష్ణ అన్నారన్న విషయాన్నిసంగీత దర్శకుడు దేవి ప్రసాద్ ప్రస్తావించారు.


