The Kashmir Files : ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పలు సినిమాలని ప్రదర్శించారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ప్రదర్శనకి వచ్చింది. 1990లో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దురాగతాలను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితం రిలీజయి దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే IFFI వేడుకల్లో ఈ సినిమాపై IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ వేదికపైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. నదవ్ లాపిడ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి చూసి మేము ఖంగుతిన్నాము. ఒక వల్గర్ కంటెంట్ తో రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కిన సినిమాలా ఉంది ఇది. ది కాశ్మీర్ ఫైల్స్ చూపించినవన్ని అవాస్తవం. ఇలాంటి ఒక అంతర్జాతీయ వేదికపై అటువంటి సినిమాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. దీంతో నదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నదవ్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్, సినిమా అభిమానులు, హిందువులు, కశ్మీర్ పండిట్స్, పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు.. నవాద్ పై తీవ్ర విమర్శలు చేశారు.
అతనికి వ్యతిరేకత రావడంతో తాజాగా IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ”నేనెప్పుడూ ఎవరిని అవమానించాలనుకొను, నేను మాట్లాడిన మాటలకి ఎవరైనా బాధపడితే అందుకు క్షమాపణలు అడుగుతున్నాను. చిత్ర దర్శకుడి కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను” అంటూ క్షమాపణలు కోరాడు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సమాచారాన్ని ట్విట్టర్ లో షేర్ చేసి.. ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ పరుడు అని ట్వీట్ చేశారు.