Nandamuri Balakrishna Comments on Film Industry: ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి భాలకృష్ణ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) ఛైర్మన్‌గా భరత్ భూషణ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. ‘సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ సినిమాలు రావాలి. థియేటర్లు, ప్రేక్షకులకు వాటిని అందించాలి. కష్టాలు వచ్చినప్పుడు అందరం ఒక కుటుంబంలా కలిసి కూర్చొని సమస్యలు పరిష్కరించుకొని, ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సాధారణంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సినిమాలకు కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో అనేక ప్రాంతాల్లో నా సినిమాలు షూటింగ్‌లు జరుపుకొన్నాయి. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం సహా అనేక ప్రాంతాలు షూటింగ్‌లకు అనుకూలంగా ఉన్నాయి. వాటిని సినీ పరిశ్రమ ఉపయోగించుకోవాలి.’’ అని అన్నారు.
Also read: Alchippa: ఆల్చిప్పలు ఏరేందుకు నదిలోకి దిగి.. కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
టెక్నాలజీ పెరిగినా సినిమాలెందుకు ఆలస్యమవుతున్నాయి?
“ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ ద్వారా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మంచి సినిమాలు చేయాలి. డబ్బింగ్ లేకుండా, మన సత్తాకు పదును పెడుతూ సందేశాత్మక చిత్రాలు తీయడం నా వరకూ నాకు తృప్తినిస్తుంది. పెద్దగా టెక్నాలజీ లేనప్పుడే సినిమాలు త్వరగా పూర్తయ్యేవి. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్నా సినిమాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు, థియేటర్ యజమానులను చూస్తుంటే జాలేస్తుంది. వారు థియేటర్లకు తాళాలు వేసుకొని వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి తగిన కృషి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని తప్పక కోరతాం.’’ అని పేర్కొన్నారు.

