Balakrishna – Akhanda 2: తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణ (బాలయ్య) ఇప్పటివరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రేక్షకులపైనే ఆధారపడేవారు. కానీ ‘అఖండ’ (2021) విడుదల తర్వాత ఉత్తర భారత ప్రేక్షకుల్లోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న విడుదల కానున్న ‘అఖండ 2’ సినిమా కోసం బాలయ్య మొదటిసారిగా పాన్-ఇండియా స్థాయిలో ప్రమోషన్లు చేపట్టడం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే మొదటిపాట “ది తాండవం”ను ముంబైలో జరిగిన ఈవెంట్‌లో లాంచ్ చేయడం, అక్కడ హిందీలో అనర్గళంగా బాలయ్య చేసిన ప్రసంగం హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం తెలిసిందే.
ఇక మంగళవారం రాత్రి విశాఖపట్నంలో “జాజికాయ” పాట విడుదల కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ, “ఇది కేవలం తెలుగు సినిమా కాదు. కర్ణాటకలోనూ, చెన్నైలోనూ ప్రత్యేక ఫంక్షన్స్ పెట్టాం. టీజర్, టైటిల్ సాంగ్ చూసిన ఉత్తర భారత ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది” అని ధీమా వ్యక్తం చేశారు. అంటే పాన్-ఇండియా లెవల్లో ఆయన అఖండ 2ను ప్రచారం చేస్తున్నారు.
Also Read: Actress Tulasi: సినిమాల నుంచి రిటర్మెంట్ తీసుకుంటున్నా.. సీనియర్ నటి తులసి సంచలన ప్రకటన
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ‘అఖండ 2’. గతంలో ఈ జోడీ ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్లు అందించింది. ఈ విజయాల నేపథ్యంలోనే ‘అఖండ 2’పై బాలయ్య అమిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాలు హిందీ బెల్ట్‌లో ఆదరణ సంపాదిస్తున్న నేపథ్యంలో, ఈసారి పాన్-ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించే లక్ష్యంతో బాలయ్య ఈ భిన్నమైన ప్రచార వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందించిన ‘అఖండ 2’ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

