ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ(BalaKrishna) హవా నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉండగా.. మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతూ ఉండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా బాలయ్య నామస్మరణే జరిగింది. తాజాగా బాలయ్య చెల్లి, సీఎం చంద్రబాబు(CM Chandrababu) భార్య నారా భువనేశ్వరి.. కుటుంబసభ్యులకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబాలతో పాటు పలువురు ముఖ్యలు హాజరయ్యారు.
ఈ పార్టీలో బాలయ్య సోదరీమణులు పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి ఆయనను సరదాగా ఇంటర్వ్యూ చేశారు.ఈ సందర్భంగా భువనేశ్వరి.. నీకు మ్యాన్షన్ హౌజ్ కి సంబంధం ఏంటి? వసుంధర కంటే మ్యాన్షన్ హౌజ్ ఎక్కువయిపోయిందా? ఎప్పుడూ చంకలో పెట్టుకొని వెళ్తావంట అని అడిగారు. దీనికి బాలయ్య సమాధానమిస్తూ.. “నాన్న గారు ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు మ్యాన్షన్ తో సమానం. ఆ మ్యాన్షన్‌లో మ్యాన్షన్ హౌజ్ ఉంటుంది. నా జీవితంలో అన్ని యాదృచ్ఛికంగానే జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాగే అయింది. అంతేకానీ దాంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏమి లేదు. అదే నన్ను ప్రేమించింది. వసుంధర, మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్ళు ” అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.