ఆమె ఒక జానపద గాయని. అక్కడక్కడా పాడుతూ తన సంగీత తృష్ణను తీర్చుకుంటూ వస్తోంది. గతంలో రఘు కుంచె సంగీత సారథ్యంలో తన టాలీవుడ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీ దాస నేడు జాతీయ స్థాయిలో పుష్ప – 2 లో కూడా పాడి పలువురి మన్ననలు అందుకుంటోంది.
ముధోల్ లోని గన్నోరా గ్రామం
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోరా గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్, దాస జయశ్రీల కుమార్తె. చిన్నప్పటి నుంచి జానపద గీతాలు పాడుతూ పలువురిని ఆకట్టుకుంటూ వస్తున్న లక్ష్మీ దాస తొలిసారిగా రఘు కుంచె సంగీత సారథ్యంలో బ్యాచ్ సినిమాలో పాటతో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసింది. అనంతరం హీరో నాని నటించిన దసరా సినిమాలో ‘ ధూమ్ ధాం చేసుకుందాం ‘ పాట పాడి పలువురి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో నిర్మించిన పుష్ప -2 సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పీలింగ్స్ పాటను పాడి అలరించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు జయశ్రీ, లక్ష్మణ్ లకు ముందుకు నడిపించిన ఆష్టా దిగంబర్, గడ్డం రమేష్, భోజన్నలకు కృతజ్ఞతలు తెలియజేసింది.