Rakul Preet Singh – Jackky Bhagnani: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించగా 2024లో విడుదలైన ‘బడే మియా చోటీ మియా’ సినిమా విడుదల తర్వాత వాశు భగ్నానీ, జాకీ భగ్నానీ ఆధ్వర్యంలోని నిర్మాణ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంస్థపై రూ. 250 కోట్లకు పైగా అప్పులు, ముంబై ఆఫీసు అమ్మకం, సిబ్బంది తొలగింపు వంటి ప్రచారం వైరల్ అవుతోంది. కంపెనీ మూతపడిందనీ, దివాలీ తీసిందనీ వదంతులు కూడా బలంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో జాకీ భగ్నానీ భార్య, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మొదటిసారి నోరు విప్పింది.
“ఇప్పుడు మనం క్లిక్‌బైట్ కల్చర్‌లో ఉన్నాం. సంచలన వార్తలు మాత్రమే నిజాలుగా చలామణీ అవుతున్నాయి. చాలా విషయాలు తప్పుగా రాశారు. కంపెనీ మూతపడలేదు. నేనేమీ చదవను కాబట్టి మొదట ఆ వార్తల గురించి నాకు తెలియలేదు కూడా. కుటుంబంలో నేను భాగం కాబట్టి అసలు నిజం ఏమిటనేది నాకు తెలుసు” అని స్పష్టం చేసింది రకుల్. రెండు మూడు సినిమాలు ప్లాప్ కావడంతో భారీ ఆర్థిక నష్టం వచ్చిందని, అది ప్రతి నిర్మాతకూ వచ్చే దశే అని ఆమె గుర్తు చేసింది. “అమితాబ్ బచ్చన్‌కు కూడా ఒకప్పుడు ఇలాంటి రోజులు వచ్చాయి. ఇది కేవలం ఒక దశ మాత్రమే. దాన్నుంచి కోలుకుంటాం” అని రకుల్ ధీమా వ్యక్తం చేసింది.
పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికీ కొనసాగుతోందని, దివాలా తీయలేదనీ కుటుంబం, ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి కోలుకుంటూ ఆ సంస్థ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ నవంబర్ 14, 2025న ‘దే దే ప్యార్ దే 2’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్‌గా వచ్చి ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గణ్, ఆర్. మాధవన్, జావేద్ జాఫ్రీలతో కలిసి ఆమె నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

