NTR Launches Itlu Arjun Trailer: కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, “ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్ కి నిదర్శనం. నీ మొదటి సినిమాకే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం చూస్తుంటే, అన్నింటికంటే కథపై నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.
నీకు అద్భుతమైన ఆరంభం లభించాలని కోరుకుంటున్నాను బ్రదర్” అని ట్వీట్ చేశారు.ఇక ట్రైలర్ పోలీసుల వేటతో ప్రారంభమవుతుంది. ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు అతడి కోసం పక్కా ప్లాన్ తో గాలిస్తుంటారు. ఈ విచారణలోకి అర్జున్ అనే మూగ యువకుడు ఎంటర్ అవుతాడు. అతను మాట్లాడలేకపోయినా, అసాధారణమైన తెలివితేటలు కలవాడని స్థానికులు చెబుతుంటారు. అద్భుతమైన తెలివితేటలతో పాటు, అర్జున్ మనసులో కీర్తిపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే, కొంతకాలానికే ఈ జంట ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. పోలీసులు, గూండాల ముఠా ఇద్దరి కోసం వేట మొదలుపెడతారు. ఒక మిస్టీరియస్ పెన్‌డ్రైవ్, ఏకంగా రూ.1,000 కోట్ల డీల్.. ఈ ఆసక్తికరమైన వేటకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
దర్శకుడు మహేష్ ఉప్పల అన్ని కమర్షియల్ అంశాలను చక్కగా మేళవిస్తూ రొమాన్స్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్‌తో కూడిన ఆసక్తికరమైన లవ్ స్టోరీని థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. హీరో అనీష్ తన నటనతో అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మాటలు లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తోనే భావోద్వేగాలను, ఆలోచనలను వ్యక్తపరచాలి. అలాంటి ఛాలెంజింగ్ పాత్రను అనీష్ ఎంతో చక్కగా పోషించారు. అనస్వర రాజన్ తన చార్మింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆమె పాత్ర అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తూనే బలమైన భావోద్వేగాలను కూడా కలిగి ఉంది. నవంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

