ఎన్టీఆర్(NTR) కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నాటు నాటు పాటలో తారక్ డ్యాన్స్‌కు అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ కూడా అభిమానులను విపరతీంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ‘చుట్టమల్లే’(Chuttamalle Song) పాట అయితే బాగా వైరల్ అయింది. ఈ పాటకు యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేశారు. తాజాగా ఈ పాటను బెంగుళూర్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో బ్రిటన్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ పాడారు. దీంతో ఓ బ్రిటీష్ సింగర్ నోట తెలుగు పాట అంటూ ఈ వీడియో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ వీడియోపై ఎన్టీఆర్ ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ‘‘సంగీతానికి హద్దులు ఉండవు. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం నిజంగా ప్రత్యేకం’’ అంటూ షీరన్‌కు థ్యాంక్స్ చెప్పారు. కాగా ఇటీవల తన పాటలకు ఎవరైనా డ్యాన్స్ చేసినా, పోస్టులు పెట్టినా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వెంటనే స్పందించడం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు.