బాలీవుడ్ దిగ్గజ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా మనోజ్ కుమార్(Manoj Kumar) మృతిపై స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ గారు మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ మనోజ్ కుమార్ గారు భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తను రూపొందించిన చిత్రాల్లో జాతీయ భావాలను ప్రస్పుటంగా… ప్రేక్షకుల మనసుల్ని హత్తుకొనేలా చూపించారు. ‘ఉపకార్’ చిత్రం ఈ రోజు చూసినా నాటి ‘జై జవాన్ జై కిసాన్’ నినాద నేపథ్యం, ప్రభావం తెలుస్తాయి. రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాలు కూడా అయిదు దశాబ్దాలకు పూర్వం ఉన్న మన సమాజ పరిస్థితులకు అద్దంపడతాయి. దేశం అంటే ప్రేమాభిమానాలు కలిగిన నటుడు, దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ గారు. ఆ బావాలే ఆయనకు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. శ్రీ మనోజ్ కుమార్ గారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
