Pawan Kalyan: ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలాగే పోస్ట్ పోన్ అవుతుందా! ఇది సగటు పవన్ కళ్యాణ్ అభిమాని మనసులో హరిహర వీరమల్లుపై ఉన్న సందేహం. అయితే మేకర్స్ మాత్రం ఈసారి పక్కా, థియేటర్స్‌లో మా సినిమా సందడి చేయనుందని చెప్పేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూలై 24న రిలీజ్ కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పటికే సాంగ్స్, టీజర్ వంటివి విడుదలైనప్పటికీ ట్రైలర్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదేంటా? అని అందరూ అనుకుంటూ వచ్చారు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది అందరిలో మరోసారి అనుమానాలు రేగాయి. అసలు హరిహర వీరమల్లు అనుకున్న తేదికి వస్తాడా? అని వార్తలు వైరల్ కాసాగాయి.
అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ మేకర్స్ ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ట్రైలర్‌ను సిద్ధం చేశారు. జూలై 3న మూవీ ట్రైలర్ (Hari Hara Veera Mallu Trailer)ను భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ట్రైలర్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌ను గమనిస్తే, పవన్ చేతిలో తుపాకీ పట్టుకుని స్టైల్‌గా దేని కోసమో ఎదురు చూస్తున్నట్లు నిలుచుని ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ కావటంతో అభిమానుల ఆనందానికి హద్దే లేదు. సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా? అని ఆనందంగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/need-to-speed-up-promotions-for-war-2/
పవన్ కళ్యాన్ హీరోగా రూపొందుతోన్న తొలి పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’. అలాగే పీరియాడిక్ సినిమా కూడా ఇదే కావటంతో సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇందులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఎదిరించే వీరుడిగా, సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. ఐదేళ్ల ముందే ప్రారంభమైన ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన విషయమేమంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
పవన్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ కూడా హరిహర వీరమల్లునే అని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఓజీ. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పవర్‌స్టార్ బిజీగా ఉన్నారు.