Pawan Kalyan| కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్(Vijay) ఆదివారం అధికారికంగా తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన పార్టీ విధివిధినాలు ప్రకటిస్తూ లక్షలాది అభిమానులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) స్పందించారు. విజయ్‌కు అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని అందులో పేర్కొన్నారు. దీంతో విజయ్ అభిమానులు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కాగా ఇటీవల విజయ్.. తమిళగ వెట్రి కళగం(Tamizhaga Vetri Kazhagam) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆదివారం సాయంత్రం పార్టీ తొలి రాష్ట్ర సదస్సు అయిన మహానాడు సభ ఏర్పాటుచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, EV రామసామి, K. కామరాజ్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్‌తో పాటు చేర, చోళ, పాండ్య రాజవంశాల పురాణ రాజుల కటౌట్స్ మధ్య సభా ప్రాంగణాన్ని అలంకరించడం విశేషం. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఈ సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనాభా రావడంతో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమైంది.
ఈ సభలో విజయ్ ఎంట్రీ అదిరిపోయింది. ఎటు చూసినా జనమే ఉండటంతో విజయ్ కూడా అభిమానులను పలకరిస్తూ ఎంతో ఉత్సాహంగా కనపడ్డారు. అనంతరం పార్టీ విధివిధానాలను తెలియజేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తన పార్టీ ధ్యేయమని స్పష్టంచేశారు. ద్రవిడ భావజాలానికి తగ్గట్లే తమ రాజకీయ కార్యకలాపాలు ఉంటాయని వెల్లడించారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని స్పష్టంచేశారు. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లు లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమని తెలిపారు. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాకే తన సినిమా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు.