Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభPushpa 2 | అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలి.. PDSU హెచ్చరికలు

Pushpa 2 | అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలి.. PDSU హెచ్చరికలు

పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు, ఆమె కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్లే మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్టు చేయాలంటూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు PDSU ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

PDSU ప్రకటన ఇదే…

అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు, తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షో కి వచ్చాడు. దీంతో తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేకమంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లను 3వేల వరకు పెంచి పేద మధ్యతరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారు. సినిమా మీద పెట్టిన పెట్టుబడులను సొమ్ము చేసుకోవడం కోసం, భారీగా లాభాలను ఆర్జించి జనం సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. అభిమానుల భారీ స్పందనతో తొక్కిసలాట జరిగింది. సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదు.

ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు నిరసన, ఆందోళన కార్యక్రమాలకు జనం రాకుండా పరిమితులు విధిస్తూ, అక్రమంగా నాయకులను అరెస్టు చేస్తూ అనేక ఆటంకాలు పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు కల్పిస్తారు. జనం గుమికూడుతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్తారు. మరి అర్ధరాత్రి హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారో చెప్పాలి.

ఆరుగాలం చెమటోడ్చి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పాలకులు పెట్టుబడిదారులు సినిమాలు తీస్తే ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. వీరి కపటనీతిని విద్యార్థులు, యువకులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఘటనకు కారణమైన జీరో (హీరో కాదు) అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News