హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె చేసే ట్వీట్లు మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయ ప్రసంగాల గురించి ఆమె పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. దీంతో ఆమెను జనసైనికులు ట్రోల్స్ చేయడం కామన్ అయింది. అలాగే ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)గురించి కూడా పూనమ్.. గతంలో సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు ఎంతో మంది జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేశారని ఆరోపించింది.
ఈ క్రమంలోనే తాజాగా త్రివ్రిక్రమ్ గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘త్రివిక్రమ్‌పై చాలా కాలం కిందట ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఆయనను ప్రశ్నించడం లేదు. చర్యలు తీసుకోవడం జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి, ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతడిని ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పూనమ్ కౌర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.