Pradeep Singh Rawat: ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అకస్మాత్ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1952లో దిల్లీలో జన్మించిన ప్రదీప్ రావత్.. కెరీర్ ప్రారంభంలో కొన్ని దూరదర్శన్ టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు.
భిక్షూ యాదవ్‌గా చెరగని ముద్ర: తెలుగులో నితిన్ – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సంచలన విజయం ‘సై’ (2004) సినిమాతో ప్రదీప్ రావత్ టాలీవుడ్ ప్రయాణం ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆయన పోషించిన ‘భిక్షూ యాదవ్’ పాత్ర తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో ఆయనకు విలన్‌గా తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. సై, భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి,జగడం, గజిని, మస్కా, ఓయ్,నేనే రాజు నేనే మంత్రి, జై లవ కుశ, వాల్తేరు వీరయ్య తదితర చిత్రాలలో విలక్షణ నటనతో మెప్పించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

