Rajasaab Movie: స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే వారి ఇమేజ్, ఫ్యాన్‌బేస్ దృష్టిలో పెట్టుకొనే కథలు రాయాలి. ఎలివేషన్లు, హీరోయిజాలు.., ఇలా సదరు హీరో నుంచి అభిమానులు కోరుకునే కమర్షియల్ హంగులన్నీ ఉంటూనే తాము అనుకున్న కథను సిల్వర్ స్క్రీన్‌పై చెప్పడం అంటే దర్శకులకు కత్తి మీద సామే. అదే మిడ్ రేంజ్, చిన్న హీరోల విషయంలో ఈ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ ఏం అవసరం ఉండవు. ఈ హీరోలతో తాము రాసుకున్న కథలను నిజాయితీగా చెప్పేందుకు దర్శకులకు అవకాశం దొరకుతుంది.
టాలీవుడ్‌లో..
అప్‌కమింగ్, మిడ్ రేంజ్ హీరోలతో ఎన్నో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయడంలో తడబడిన సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేక డిజాస్టర్లతో విమర్శలు ఎదుర్కొన్నారు.
టాప్ హీరో.. వజ్రం..
ఈ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్లలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కృష్ణారెడ్డి మినిమం గ్యారెంటీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. శుభలగ్నం, యమలీల, మావిచిగురు ఇలా.. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోయాడు. శ్రీకాంత్, జగపతిబాబు లాంటి వాళ్లకు ఎన్నో సక్సెస్‌లు అందించిన ఎస్వీ కృష్టారెడ్డి.. అగ్ర హీరోలకు మాత్రం మరచిపోలేని డిజాస్టర్లు ఇచ్చారు. బాలకృష్ణతో టాప్ హీరో, నాగార్జునతో వజ్రం సినిమాలు చేశాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డికి స్టార్స్‌తో సినిమా చేసే అవకాశం దక్కలేదు.
అల్లుడా మజాకా..
చిరంజీవి అల్లుడా మజాకా విషయంలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పటివరకు చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈవీవీ సత్యనారాయణకు ఫస్ట్ టైమ్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కింది. కానీ అల్లుడా మజాకాలో రొమాన్స్ డోస్ ఎక్కువ కావడం, వల్గర్ కామెడీ కారణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈవీవీకి మళ్లీ చిరు ఛాన్స్ ఇవ్వలేదు.
మారుతి బాబు బంగారం..
రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూడా ఎక్కువగా టైర్ టూ హీరోలతోనే సినిమాలు చేశారు. బాబు బంగారం మూవీతో మొదటిసారి వెంకటేష్ వంటి అగ్ర నటుడిగా సినిమా చేసే అవకాశం 2016లో మారుతికి దక్కింది. కానీ వెంకటేష్ రేంజ్, స్టామినాకు తగ్గ కథను రాసుకోవడంలో మారుతి విఫలం కావడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు మారుతి. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేడంటూ తనపై వచ్చిన విమర్శలను రాజాసాబ్‌తో మారుతి దూరం చేసుకుంటాడో లేదో చూడాల్సిందే. టాలీవుడ్ సంబంధించిన ఈ సెంటిమెంట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.