Wednesday, January 14, 2026
HomeTop StoriesThe Raja Saab Review : ‘ది రాజా సాబ్’తో ప్రభాస్ నవ్వించాడా? లేక భయపెట్టాడా?

The Raja Saab Review : ‘ది రాజా సాబ్’తో ప్రభాస్ నవ్వించాడా? లేక భయపెట్టాడా?

The Raja Saab Review: గ‌త ఏడాది ప్ర‌భాస్ న‌టించిన సినిమాలేవి రిలీజ్ కాలేదు.. కానీ డార్లింగ్ ఈ ఏడాది సంక్రాంతికి ‘ది రాజాసాబ్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. క‌ల్కి 2898 ఏడీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్ర‌భాస్.. ఈ మ‌ధ్యంతా మాస్, యాక్ష‌న్ సినిమాలనే చేస్తూ వ‌చ్చాడు. ఈసారి కొత్త ప్ర‌య‌త్నిద్దామ‌ని చేసిన సినిమాయే ది రాజాసాబ్. ఈ హార‌ర్ కామెడీ జోన‌ర్ మూవీని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. మ‌రి ప్ర‌భాస్ చేసిన ఈ ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అయ్యిందా? సినిమా ఎలా ఉంది? ది రాజా సాబ్ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించి మెప్పించాడా? లేదా భ‌య‌పెట్టాడా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

- Advertisement -

క‌థ‌:
రాజు (ప్ర‌భాస్‌) త‌న నాన్న‌మ్మ గంగాదేవి (జ‌రీనా వ‌హాబ్)తో క‌లిసి ఉంటుంటాడు. ఆమె అల్జీమ‌ర్స్‌తో బాధ‌ప‌డుతుంటుంది. అన్నీ విష‌యాల‌ను మ‌ర‌చిపోయినా త‌న భ‌ర్త క‌న‌క‌రాజు(సంజ‌య్‌ద‌త్‌)ను మాత్రం మ‌ర‌చిపోదు. నాన్న‌మ్మ మీద ప్రేమ‌తో క‌నిపించ‌కుండా పోయిన తాత‌య్య‌ను రాజు వెతుకుతుంటాడు. కానీ క‌న‌క‌రాజు జాడ మాత్రం క‌నిపించదు. ఓరోజు అనుకోకుండా క‌న‌క‌రాజు హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. దాంతో హైద‌రాబాద్ చేరుకున్న రాజుకి.. న‌ర్సాపూర్ ఫారెస్ట్‌లో తాత‌య్య ఉన్నాడ‌ని తెలుస్తుంది. త‌న స్నేహితులు, ప్రేమించిన అమ్మాయి భైర‌వి (మాళ‌వికా మోహ‌న‌న్‌)తో క‌లిసి అడ‌వికి వెళ‌తాడు.

అక్క‌డున్న పాడుప‌డ్డ భ‌వంతిలోకి వారితో క‌లిసి వెళ‌తాడు. అయితే ఆ భ‌వంతి మామూలుగా ఉండ‌దు. మాయ‌లు, మంత్రాల‌తో నిండి ఉంటుంది. రాజు అండ్ గ్యాంగ్ లోప‌లికి వ‌స్తుందే కానీ.. భ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతుంది. అస‌లు ఏం జ‌రిగింది. క‌న‌క‌రాజు ఆ భ‌వంతిలో ఏం చేస్తుంటాడు? రాజుని అక్క‌డ‌కి ఎందుకు ర‌ప్పించుకుంటాడు? క‌న‌క‌రాజు, గంగ‌మ్మ గ‌తం ఏంటి? గ‌ంగ‌రాజుకి, క‌న‌క‌రాజుకి ఉన్న సంబంధం ఏంటి? చివ‌ర‌కు రాజు అండ్ టీమ్ అక్క‌డ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? భైర‌వితో పాటు రాజుని ఇష్ట‌ప‌డ్డ‌ జెస్సీ, అనిత ఎవ‌రు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:
హారర్ సినిమా అంటే ఓ పాత భంగ‌ళా, అందులో దెయ్యం, ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లను భయపెట్టడమో, న‌వ్వించ‌ట‌మో జ‌రుగుతుంటుంది. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ సినిమాల‌కు సంబంధించిన‌ ఫార్ములా. దర్శకుడు మారుతి గతంలో తెరకెక్కించిన ‘ప్రేమ కథా చిత్రం’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. అలాంటి కథనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అనుగుణంగా మలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో చేసిన‌ సినిమాయే ‘రాజాసాబ్’. హారర్‌కు ఫాంటసీ, హిప్నాటిజం, మైండ్ గేమ్స్ వంటి అంశాలను జోడించి తెర‌కెక్కించారు.

Also Read – Mexico : ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మెక్సికో.. గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్.!

ఓ స్వార్థపరుడు రాజకుమారిపై మనసుపడతాడు. ఆమె ఆస్తిని కూడా చేజిక్కించుకోవాలన్న ఆశతో మంత్రాలు, మాయలు నేర్చుకుని చివరికి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ తర్వాత తరంలో మనవడు వచ్చి ప్రతీకారం తీర్చుకునే కథ ఇది. ఇలాంటి క‌థ‌లో ప్రభాస్‌ను చూపించాలన్న ఆలోచ‌న కొత్త‌గా ఉన్నప్పటికీ, ఆ ఐడియాను తెరపై ఆవిష్కరించడంలో మారుతి విఫలయ్యాడు.

క‌మెడియ‌న్ సత్య ఎపిసోడ్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లో ఏదో రహస్యం ఉంది, దానికి హీరోకి ఏదో లింక్ ఉంద‌ని స్టార్టింగ్‌లోనే అంద‌రికీ మైండ్‌లో ఉండిపోయేలా స‌న్నివేశం మొద‌ల‌వుతుంది. అయితే రాజాసాబ్ ఎంట్రీ, ఫైట్స్, పాటలు, రొమాన్స్… అన్నీ ఊహించిన దారిలోనే సాగిపోతాయి. ముఖ్యంగా ప్రభాస్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం చేర్చిన సీన్స్ కథను ముందుకు నడిపించకుండా కేవలం ఏదో ఇక్క‌డిలా ఉంటే క‌మ‌ర్షియ‌ల్‌గా బావుంటుంద‌నే ఆలోచ‌న‌తో చేసిన‌ట్లు అనిపించాయి. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను పెట్టడం ఎందుకు ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకదు. ప్రభాస్‌కు వింటేజ్ వైబ్ తీసుకురావడానికి ఇది అవసరమా అనే డౌట్ వ‌స్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆశించినంత వినోదాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభాస్ పలికిన కొన్ని డైలాగులు స్పష్టంగా వినిపించకపోవడం మరో మైనస్‌గా మారింది.

ఇంటర్వెల్ ముందు వరకు కథలో పెద్దగా స్పీడు క‌నిపించ‌దు. సినిమాను ముందుకు న‌డిపించాలిగా అన్న‌ట్లు సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంత బెటర్‌గా ఉన్నప్పటికీ, దాన్ని ఇంకా బలంగా ఉండుంటే బావుండేద‌నిపించింది. సెకండాఫ్‌లో అయినా సినిమా స్పీడందుకుందా? అనుకుంటే అదే పంథాలోస్లోగానే సాగుతుంది. మారుతి సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే కామెడీ టైమింగ్ ఈ సినిమాలో క‌నిపించ‌లేదు. ప్రభాస్ చాలాకాలం తర్వాత కామెడీ చేయడం వల్ల నవ్వులు పూయిస్తాడనే అంచనాలు నెరవేరలేదు. ఇది హారర్ సినిమా అన్నప్పుడు భయం ప్రధానంగా ఉండాలి. కానీ ఆ భయాంశాన్ని దర్శకుడు సరిగా తీసుకురాలేకపోయాడు. హాంటెడ్ మహల్‌లో ఉన్న పాత్రలు సేఫ్ హౌస్‌లో ఉన్నట్టుగా రిలాక్స్ అవుతూ రొమాన్స్ చేయడం ప్రేక్షకుల్లో టెన్షన్‌ను కలిగించదు. సంజయ్ దత్ పాత్ర నుంచి వచ్చే ప్రమాదం ఏంటన్నది కూడా స్పష్టంగా చూపించలేకపోయారు.

క్లైమాక్స్ విషయంలో మాత్రం మారుతి కొంత మెరుగ్గా హ్యాండిల్ చేశాడు. హాస్పిటల్ సీన్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. మైండ్ గేమ్ ఎలిమెంట్‌ను అక్కడ బాగానే ఉపయోగించుకున్నాడు. చివరి 20 నిమిషాలు ఆసక్తికరంగా అనిపించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. కనకరాజు పాత్ర డిజైన్‌లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అపరమేధావి, మానసిక శాస్త్రవేత్తగా బిల్డప్ ఇచ్చి, చివరికి సంపద కోసం క్షుద్ర పూజలు చేసే వ్యక్తిగా చూపించడం పూర్తిగా కన్విన్సింగా అనిపిచ‌దు.

ప్రభాస్ స్టైలిష్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించాడు. ఆయన ఈజ్ ఫ్యాన్స్‌కు ఇది నచ్చే అంశం. అయితే కొన్ని సన్నివేశాల్లో డూప్ వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది. హాస్పిటల్ సీన్‌లో మాత్రం ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో మాళవికకు కొంత స్క్రీన్ స్పేస్ దక్కింది. సంజయ్ దత్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేదనే భావన కలుగుతుంది. జరీనావ‌హాబ్ పాత్ర, ఆమె నటన మాత్రం ప్లస్ పాయింట్. సప్తగిరి, ప్రభాస్ శ్రీను, సత్య ఉన్నా ఆశించిన స్థాయిలో నవ్వులు పండలేదు.

సాంకేతికంగా సినిమా మీద భారీగానే ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మహల్ సెట్ ఆకట్టుకుంటుంది. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగుండగా, మరికొన్ని చోట్ల తేలిపోయాయి. తమన్ పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది.

Also Read – HONOR Magic8 Lite : 7500mAh బ్యాటరీ.. సముద్రంలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు.!

మొత్తానికి హారర్‌లో ఫాంటసీని మిక్స్ చేయాలన్న మారుతి ఆలోచన కొత్తదే. కానీ ఆ ఐడియాను తెరపై సమర్థంగా అమలు చేయడంలో ‘రాజాసాబ్’ తడబడింది. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అన్న ప్రచారానికి తగిన స్థాయి కంటెంట్ మాత్రం ఇందులో కనిపించలేదు.

చివ‌ర‌గా.. త‌డ‌బడ్డ రాజాసాబ్.. స‌హ‌నానికి పరీక్ష‌

రేటింగ్‌: 2/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News