నటన పట్ల తనకు ఉన్న ఆసక్తిని గుర్తించి, అడుగడుగునా ప్రోత్సహించి నటిగా తీర్చిదిద్దింది తన తల్లిదండ్రులేనని చెప్తోంది వర్ధమాన నాయిక ప్రీతి ముకుందన్. గతంలో టాలీవుడ్ లో మంచు విష్ణు ‘కన్నప్ప’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలలో నటించిన ఆమెకు ఇక్కడ అంతగా కలసి రాలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ఇటీవల ‘ఇదయమ్ మురళి’, ‘బ్లాస్ట్’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుని బ్లాక్‌బస్టర్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్ లో కూడా ఆమెకు ఓ ఆఫర్ లభించింది. ప్రస్తుతం కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తన నటనా ప్రయాణం ప్రారంభమైన తీరును ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. “మాది అకడమిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే కుటుంబం. నా చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో, నాకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కూడా మా అమ్మానాన్నలు అంతే విరివిగా ఇచ్చారు. నా 18 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఆఫర్ వచ్చింది. అయితే, నాకు నటన రాదని, ఆడిషన్స్‌కు వెళ్తే ఎక్కడ నవ్వులపాలవుతానోనని భయపడి వెనకడుగు వేశాను. నాపై నాకే నమ్మకం లేని ఆ సమయంలో మా అమ్మానాన్నలు ప్రత్యేకంగా నా కాలేజీ హాస్టల్‌కు వచ్చి నాతో మాట్లాడారు. ‘ఒక్కసారి ప్రయత్నించి చూడు, పోయేదేమీ లేదు’ అని ధైర్యం చెప్పారు.” అని తెలిపింది. ఆ ఒక్క ఆడిషన్ తన జీవితాన్ని మలుపు తిప్పిందని ప్రీతి చెప్పింది. “ఆ ఆడిషన్‌లో నాకు అవకాశం రాలేదు. కానీ, ఆ ప్రయత్నం నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ అనుభవంతోనే నాకు సినిమాలపై నిజమైన ఇష్టం, నటన పట్ల అంకితభావం ఏర్పడ్డాయి. మా కుటుంబానికి చిత్ర పరిశ్రమ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా, వారు నాపై ఉంచిన నమ్మకమే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది” అని వెల్లడించింది ఈ చెన్నై భామ.

