ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా(TFDC) బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి(KomatiReddy Venkat Reddy)కృతజ్ఞతలు చెప్పారు. టీఎఫ్‌డీసీకి పూర్వవైభవం తీసుకురావాలని.. ఇందుకు అందరి సహకారం అవసరం ఉందన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా తనపై ఎంతో బాధ్యత ఉందన్నారు. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా అని దిల్ రాజు వెల్లడించారు.
కాగా దిల్‌రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. అయితే సినిమాల మీద ఆసక్తితో తొలుత డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘దిల్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. అప్పటి నుంచి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి. అలాగే నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ సినిమాకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.