గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు(Dil Raju) ఇంట్లో సోదాలు కొనసాగుతూ ఉండగా.. ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోదాల నేపథ్యంలో కుటుంబసభ్యుల కార్లు వాడటానికి అవకాం లేకపోవడంతో.. ఐటీ అధికారులకు సంబంధించిన కారులోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దిల్ రాజు తల్లి వెంట కుటుంబసభ్యులతో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. మిగిలిన అధికారులు మాత్రం ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు ముగిశాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఏషియన్ సినిమాస్, తదితర ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.