ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన మ్యాడ్ స్క్వేర్'(MAD Square) కూడా మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. సినిమా మొత్తం ఫుల్ కామెడీగా ఉండటంతో ఆడియన్స్ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాలను తలదన్నేలా వసూళ్లు దక్కించుకుంటుంది.
తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ప్రెస్ మీట్ పెట్టారు. పలు వెబ్‌సైట్స్ ఈ చిత్రానికి నెగిటిట్ రివ్యూలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. దీనిపై నాగవంశీ ఘాటుగా స్పందించారు. ‘కంటెంట్ లేకపోయిన కూడా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదు. ఎలా ఉన్నా చూడడానికి ఇదేం బాహుబలి2, పుష్ప2, కేజీఎఫ్2 కాదు కదా. సినిమాలో కంటెంట్ లేకుండా చూడడానికి ఇందులో స్టార్ హీరోలు నటించలేదు. థియేటర్లలో చాలా సార్లు సినిమా చూశాను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ప్రేక్షకులకు తెలిసినంత బాగా రివ్యూవర్‌లకు తెలియడం లేదు.
నా మీద పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్ రన్ అవుతాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే యూట్యూబ్ ఛానెళ్లు పని చేస్తాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పని చేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా కంటెంట్ లేని సినిమా ఎందుకు ఆడుతుందో తెలియడం లేదు అంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి.’ అంటూ నాగవంశీ వార్నింగ్ ఇచ్చారు.