WAR 2 Telugu Release Rights: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ హైప్స్ పెంచేశాయి. దీంతో ఈ సినిమా తెలుగు రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. ఎట్టకేలకు ఈ చిత్రం తెలుగు రైట్స్ ఖరారయ్యాయి. ఫ్యాన్ బాయ్, తారక్ వీరాభిమాని నిర్మాత నాగవంశీ ఈ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ దక్కించుకున్నాడు.
ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ వీడియో అభిమానులతో పంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెలుగులో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తనకెంతో ఇష్టమైన తారక్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు రావడం ఆనందంగా ఉందని నాగవంశీ తెలిపారు. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ సినిమాలు తమ బ్యానర్‌పై విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్నాయన్నారు. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కోసం అభిమానులంతా సిద్ధంగా ఉండండని చెప్పుకొచ్చారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం అంటూ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చారు.
ఈ మూవీ డీల్ దాదాపు రూ. 90 కోట్లకు క్లోజ్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. డబ్బింగ్ సినిమాలలోనే అత్యధిక ధర పలికిన సినిమాగా ‘వార్ 2’ మూవీ రికార్డ్ సృష్టించింది. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ మూవీల తర్వాత వార్ 2 మూవీని నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఓ హిందీ సినిమా తెలుగులో అంత భారీ ధర పలకడానికి ఎన్టీఆర్ నటించడమే కారణం. అందులోనూ నాగవంశీ.. తారక్ అభిమాని కావడం మరో కారణంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆ డబ్బులను తిరిగి రాబట్టుకోవడంతో పాటు లాభాలు పొందడానికి నాగవంశీ మంచి ప్లాన్స్ వేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలు కూడా వేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టాలని యోచిస్తున్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్‌లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.