సీనియర్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prudhvi Raj) లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ(YCP) అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పృథ్వీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. అయినప్పటికీ తనను వేధిస్తున్న వైసీపీ కార్యకర్తలు, నేతలను పచ్చిబూతులు తిడుతూ రెచ్చిపోయారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి పొందారు. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న పృథ్వీ జనసేనకు దగ్గరయ్యారు. సందర్భంగా దొరికినప్పుడల్లా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.