Puri Jagannadh controversial comments: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు తగ్గించినా.. పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్‌లు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చెబుతూ అందర్నీ ఆలోచింపజేస్తుంటారు. ఆయన రిలీజ్ చేసే పాడ్ కాస్ట్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే, పూరీ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడంతో కొన్ని కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటారు. తాజాగా, పూరీ చేసిన ఓ పాడ్‌కాస్ట్ వివాదాస్పదమైంది. భార్య భర్తల సంసారానికి సంబంధించి పూరీ చేసిన ఓ పాడ్‌కాస్ట్ ఆడియో ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. భర్తలు ఏం చేసినా భార్యలు సర్దుకుపోవాలి అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆఖరికి దేవుడిని పెళ్లి చేసుకున్నా అంతేనని వ్యాఖ్యానించారు. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి, తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవర్, పర్ఫెక్ట్ డాక్టర్, నర్సు దొరకొచ్చు.. కానీ పర్ఫెక్ట్ భర్త మాత్రం ఉండరని చెప్పారు. నా భర్తకు ఇలాంటి క్వాలిటీలే ఉండాలని మీరు ఎంతపెద్ద లిస్ట్ రాసుకుంటే అంత బాధపడతారని మహిళలకు సూచించారు.
Also read: Bakrid holiday: బక్రీద్ సెలవు దినంలో మార్పు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!
భార్యను ఎక్కువగా ఏడిపించేది భర్తే..
జీవితంలో చాలా మంది మహిళలను రకరకాలుగా ఏడిపిస్తారని, అందులో ఎక్కువగా ఏడిపించే అవకాశం భర్తకే ఉంటుందన్నారు. భర్త జీవితాంతం పక్కనే ఉంటాడు కాబట్టి ఆ అవకాశం భర్తకే ఉంటుందన్నారు. మీ నాన్న తప్పు చేస్తే మీ అమ్మ ఎలాగైతే క్షమిస్తుందో.. అలాగే, మీరూ క్షమించండని మహిళలకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. రాముడితో సహా ప్రతి దేవుడు తన భార్యను ఏడ్పించినవారేనని సంచలన కామెంట్స్ చేశారు. మీకు ఆ మాత్రం ఏడుపులు భర్త ఉన్నా, లేకపోయినా కామన్ అంటూ వ్యాఖ్యానించారు. మీ కంట్లో కన్నీళ్లు చూడకుంటే పక్కంటి వదినకు అస్సలు నచ్చదని, అందుకే పక్కింటి వాళ్లు చెప్పే మాటలు విని మీ భర్తతో అస్సలు గొడవపడొద్దని సలహా ఇచ్చారు. అయితే, పూరీ వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా.. పురుషాధిక్యంతో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పూరి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

