ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’(Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మూవీ ఇప్పటివరకు రూ.1800కోట్లకు పైగా కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగు సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ప్రోమో విడుదల చేసింది. ‘‘పుష్ప2: ది రూల్’ 50 ఐకానిక్ డేస్ పూర్తి చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. రీలోడెడ్ వెర్షన్‌ను ఇప్పుడు ఆస్వాదించండి’’ అని పేర్కొంది. 32 రోజుల్లోనే ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ‘పుష్ప2’ను ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.