Raghava Lawrence into Political entry soon: నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడిగానే కాకుండా తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ రాజీనామా చేయనున్న తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన తాజాగా స్పందించారు. కాగా, ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకున్నారు. దీంతో, త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో విజయ్ నేతృత్వంలోని టీవీకే తరఫున లారెన్స్ బరిలోకి దిగనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్స్‌లో ఆయన స్పందించారు. ‘తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది.
Also Read: Telangana Schools: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జూన్ 15న సర్కారు బడులు రీఓపెన్.. సర్క్యులర్ జారీ
లారెన్స్ ఏం చెప్పనున్నారు?
దీనిపై స్పష్టత ఇవ్వాలని అనేక మంది మీడియా మిత్రులు నాకు ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. 10వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తా’’ అని ఎక్స్ వేదికగా తెలిపారు. నటనలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో లారెన్స్ చురుగ్గా ఉంటారు. అమ్మ పేరు మీద అనాథలు, వృద్ధులకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నానని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కోరినా, ఆయనకు ట్యాగ్ చేసిన తన టీమ్, స్నేహితులతో వారిని వెతికి మరీ ఆదుకుంటారు. ఈ నేపథ్యంలో లారెన్స్ రాజకీయాల్లో వస్తున్నారన్న వార్తలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. తనకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున రాఘవ లారెన్స్ ఏం ప్రకటన చేస్తారా? అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

