రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నాలుగు పదుల వయసులోకి ఎప్పుడో అడుగుపెట్టారు. ఓవైపు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నా.. మరోవైపు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదనే వెలితి అభిమానుల్లో ఉంది. దీంతో డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు పెళ్లి చేసుకుంటారా.. లేదా..? అని తరుచూ చర్చించుకుంటారు. పెళ్లి చేసుకంటే ఏ అమ్మాయిని చేసుకుంటారు. హీరోయిన్లను చేసుకుంటారా..? లేదా ఇంట్లో పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకుంటారా..? ఇవే సందేహాలు. ఇక సెలబ్రెటీలకు కూడా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా హీరో రామ్ చరణ్ (Ram Charan) ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ ఈ కార్యక్రమంలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన తొలి భాగం జనవరి 8న విడుదలైంది. ఇందులో చరణ్ పలు విశేషాలు పంచుకున్నారు. మరో ఎపిసోడ్‌లో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్ చరణ్ సమధానం చెప్పినట్లు సమాచారం. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. దీంతో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.