రోడ్డు ప్రమాదంలో అభిమానుల మృతిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన సన్నిహితులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ తమ ఫంక్షన్‌లకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటామని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే అన్నారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలనన్నారు. తనకు అంతే బాధగా ఉందని.. అభిమానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అని చెర్రీ తెలిపారు.
కాగా ఇటీవల ‘గేమ్ ఛేంజర్’(Game Changer) ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. రాజమండ్రి నుంచి కాకినాడకకు బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలోప్రమాదవశాత్తు ఓ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో మరణించారు.