చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ముంబైలోని అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “నా మీద అంధేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది 7 ఏళ్ల క్రితం నాటి విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హజరవుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను” అంటూ తెలిపారు.
కాగా 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ ముంబై అంథేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది కోర్టు. అలాగే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది.