గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ప్రముఖ దర్శకుడు శంకర్ కలయికలో ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు వసూళ్లపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ డే ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ. 186కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. అయితే రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ మూవీ తొలి రోజు వసూళ్లు కూడా ఫేక్ అంటూ చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తనదైన శైలిలో స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. “ఒకవేళ ‘గేమ్ ఛేంజర్’ తొలి రోజు వసూళ్లు రూ. 186 కోట్లు అయితే, ‘పుష్ప 2’ కలెక్షన్స్ రూ. 1,860 కోట్లు ఉండాలి. ‘గేమ్ ఛేంజర్’కు రూ. 450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రూ. 4,500 కోట్లు ఖర్చయి ఉండాలి. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో అబద్ధాలు నమ్మదగినవిగా ఉండాలి. అయితే, వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నా” అంటూ రాసుకొచ్చారు.