Ram Gopal Varma| వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma) ‘పుష్ప2′(Pushpa2) టికెట్ల రేట్లపై తనదైన రీతిలో స్పందించారు. ‘పుష్ప2’ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీగా పెరిగిన టికెట్ ధరలపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప2’ టికెట్‌లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చుతూ ఆర్జీవీ(RGV) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
‘‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి.. ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ, కస్టమర్‌కు ఆ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు అతడి హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఎవరైనా ఏడిస్తే, అది ‘సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఏడ్చినంత వెర్రితనం.
లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు. ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటి కన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి ‘పుష్ప 2’ సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా?” అని ఆర్జీవీ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.