Ramayana Controversy: బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా గురించే. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్, కేవలం దాని గ్రాండ్‌నెస్ వల్లే కాదు, ఏకంగా టైటిల్ విషయంలోనే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ‘రామాయణ’ అనే టైటిల్ పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దాన్ని సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ డిబేట్ ఇప్పుడు ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.
చితలే గ్రూప్ ఓనర్లలో ఒకరైన నిఖిల్ చితలే ఈ వివాదానికి తెర తీశారు. టైటిల్ ‘రామాయణ్’ అని పెట్టాలి, ‘రామాయణ’ అని కాదు అని ఆయన చెబుతున్నారు. మన గొప్ప వారసత్వ సంపద అయిన రామాయణ్, రామ్ వంటి పదాలను ఆంగ్లీకరించి, వాటిని వలసవాదుల యాసకు తగ్గట్టుగా మార్చడం తప్పు అని ఆయన విమర్శలు చేశారు. వాల్మీకి రాసిన ప్రామాణికాలనే ఉపయోగించాలని, మన సంస్కృతి, వారసత్వం యొక్క అసలు సిసలైన రూపాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యమని నిఖిల్ చితలే తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఆయన వాదనకు చాలామంది నెటిజన్లు జై కొట్టారు.
అయితే ఈ విషయంలో అందరూ నిఖిల్ చితలేతో ఏకీభవించడం లేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు కన్నడ భాష గురించి ప్రస్తావించారు. కన్నడలో దాదాపు ప్రతీ పదం చివరా ‘అ’ అని వస్తుందని, అది ఆంగ్ల భాష ప్రభావం కాదని, అది కన్నడిగుల భాషలో సహజసిద్ధమైన భాగం అని వారు వివరించారు. ఇంకొందరు మాత్రం సంస్కృతంలో కూడా రామ, రామాయణ అనే ఉంటాయని గుర్తు చేశారు. సినిమాను హిందీలో తీస్తున్నప్పుడు, హిందీ స్పెల్లింగ్‌లనే ఉంచడం సరైనదని మరికొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తానికి, ‘అ’ వర్సెస్ ‘ణ్’ డిబేట్ హాట్ హాట్‌గా సాగుతోంది.
రామాయణ మూవీ మేకర్స్ విషయానికొస్తే, ఈ వివాదం నడుస్తున్నా కూడా వారు సినిమాను పూర్తి చేయటంలో బిజీగా ఉన్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఇంట్రో గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదలవుతుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.