Dhurandhar Collections: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మించి దూసుకెళ్తోది. యాక్షన్, థ్రిల్, ఎమోషన్స్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. అక్షయ్ ఖన్నా విలనిజానికి మంచి మార్కులే పడుతున్నాయి. ఇంకా ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ధురంధర్’ విడుదలైన తొలి రోజునుంచే మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. తొలి 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. సినిమా హిట్ అవుతుందనుకున్నారు కానీ.. ఈ రేంజ్ రిజల్ట్ వస్తుందని ఊహించిన ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. సెకండ్ ఫ్రైడే రోజుకి ఈ సినిమా రూ.252 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ సర్కిల్స్ సమాచారం.
Also Read – ISRO: 21న నింగిలోకి ‘బ్లూబర్డ్-6’ శాటిలైట్
శుక్రవారం (డిసెంబర్ 11న) ఒక్కరోజే రూ.34.70 కోట్ల వసూళ్లు సాధించి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది ధురంధర్ మూవీ. ముఖ్యంగా రెండో శుక్రవారం నాడు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచిందని బాలీవుడ్ మూవీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2: ది రూల్’, ‘ఛావా’, ‘యానిమల్’, ‘గదర్ 2’, ‘బాహుబలి 2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్లను కూడా ఈ సినిమా వెనక్కి నెట్టిందని ట్రేడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. హిందీలో రెండో శుక్రవారం రోజున ఆ సినిమా రూ.27.50 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘ధురంధర్’ ఆ రికార్డును అధిగమించింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియాలో ధురంధర్ గురించి ప్రస్తావిస్తూ.. రెండో శుక్రవారం హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ‘ధురంధర్’ రూ.34.70 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘యానిమల్’, ‘గదర్ 2’, ‘బాహుబలి 2’ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
సినిమా బాక్సాఫీస్ దగ్గర చూపిస్తోన్న జోరు చూసి బాలీవుడ్ జనాలు సంతోషపడుతున్నారు. చాన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేసిన వారికి ధురంధర్ రూపంలో సమాధానం దొరికినట్లయ్యింది. సినిమా ఇదే స్పీడుతో ముందుకెళితే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ సర్కిల్స్ అంచనా వేస్తున్నారు. దర్శకుడు ఆదిత్యధర్‌ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.

