Rashmika Mandanna at Epic trailer launch : “ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ నాకెంతో నచ్చింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
“నా పేరు ఆనంద్.. సారీ సారీ.. ఆదిత్య.. నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది.. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది.. ఓ మంచి సినిమా, మన సినిమా తీయాలని ఉంది” అంటూ సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత విదేశాలకు హీరో వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ల సన్నివేశాలు, లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా రీఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్నా మాట్లాడుతూ, “ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమా కోసమే కష్టపడుతుంటాడు. కడలి పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంతో వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది. ఆదిత్యను చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. ‘90స్’ తర్వాత ఆయనపై బాధ్యత పెరిగిపోయింది. హేషమ్ మ్యూజిక్ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. టీమ్ తో కలిసి నేనూ సినిమాని చూస్తాను” అని అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ, “యంగ్ డైరెక్టర్స్ అందరినీ ఈ ఈవెంట్ లో చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆదిత్య రైటింగ్ బాగుంటుంది. ఆనంద్, వైష్ణవి కలిసి చేసిన ‘బేబి’ గొప్ప విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో ఆదిత్య చేస్తుండటం, ఆ సినిమాతో ఎక్కడా పోలికలు రాకపోవడం గొప్ప విషయం” అని అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘‘మా కోసం వచ్చిన మా వదినమ్మ రష్మికకు థాంక్స్. ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచే వదినమ్మ దొరకడం నా అదృష్టం. ‘ఎపిక్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. మన జీవితంలో ఎన్నో ఎపిక్ మూమెంట్స్ ఉంటాయి. మనం బాధల్లో ఉంటే భాగస్వామి వచ్చి పట్టుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా ఎపిక్ మూమెంట్ అవుతుంది. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను.
ఈ సినిమా అందరికీ ఓ థెరపీలా ఉంటుంది. ఇదొక ఎమోషనల్ సినిమా. మనల్ని మనం తెరపై చూసుకున్నట్టుగా అనిపిస్తుంది” అని పేర్కొనగా…వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, “కడలి పాత్రలో నన్ను చూసి, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిత్యకి థాంక్స్. ఆనంద్‌లో ఎప్పుడూ ఒకేలా ఉండటం అనే లక్షణమే నాకు ఇష్టం” అని అన్నారు. నటుడు శివాజీ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో మంచి పాత్రను ఇచ్చిన ఆదిత్యకి, నాగవంశీకి థాంక్స్. ఇదంతా కూడా ఆదిత్య క్రియేట్ చేసిన ప్రపంచం” అని అన్నారు. ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూసి అందరికీ కల్చరల్ షాక్ కలిగే ఉంటుంది. ఇందులో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఆ విషయం సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది. అందరికీ ‘ఎపిక్’ సినిమా నచ్చుతుంది” అని అన్నారు. ఇంకా ఈ ఈవెంట్లో పలువురు పాల్గొన్నారు.

