సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తండ్రి భాస్కర్(Reavti Husband) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందన్నారు. నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయని తెలిపారు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడని.. కానీ మమ్మల్ని గుర్తు పట్టడం లేదని వాపోయారు. పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారన్నారు.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రూ.50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షల చెక్కు, అల్లు అర్జున్(Allu Arjun) నుంచి రూ.10లక్షల డీడీ అందిందన్నారు. అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నారనే బాధతో కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పానని.. తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు. ఘటన జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ తనకు అండగా ఉన్నారనే సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పానని వివరించారు. అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజూ వచ్చి అప్‌డేట్ తీసుకుంటున్నారని భాస్కర్ వెల్లడించారు.