Fish Venkat: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బోడుప్పల్‌లోని ఆర్.బి.ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. తాజాగా వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో పంచుకున్న హార్ట్ బ్రేకింగ్ విషయాలు అందరినీ కదిలించాయి. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గత నాలుగేళ్లుగా డయాలసిస్ ద్వారానే ఆయన ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నామని ఆమె వెల్లడించింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారడంతో, కనీసం ఒక కిడ్నీనైనా మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పినట్లు స్రవంతి వివరించింది.
తండ్రి ఆపరేషన్‌కు సుమారు రూ. 50 లక్షల భారీ ఖర్చు అవుతుందని, అంత డబ్బు సమకూర్చుకోవడం తమకు పెద్ద సవాల్‌గా మారిందని స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ తెలిపింది. దాతలు ముందుకు వచ్చి తమ తండ్రిని ఆదుకోవాలని స్రవంతి ఎమోషనల్‌గా రిక్వెస్ట్ చేసింది. అయితే, ఈ కష్టకాలంలో ఒక బిగ్ న్యూస్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. తాజాగా, ఫిష్ వెంకట్ కూతురు స్రవంతికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి, ‘కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బులను సమకూరుస్తాం’ అని హామీ ఇచ్చారని స్రవంతి తెలిపింది. ఈ విషయం బయటకు రావటంతో అందరూ ప్రభాస్ ఎంత మంచి వ్యక్తో అని అప్రిషియేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం, ఫిష్ వెంకట్ రక్త గ్రూప్‌తో మ్యాచ్ అయ్యే దాత కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్రవంతి రక్త గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్లు తిరస్కరించారని, అలాగే తన నాన్న తమ్ముడి రక్త గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో డాక్టర్లు వద్దన్నారని స్రవంతి వివరించింది. దాతల కోసం పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నామని ఆమె పేర్కొంది.
ఫిష్ వెంకట్ నటన విషయానికి వస్తే ఆయన ‘ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్ని, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు’ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై టాలీవుడ్ కమ్యూనిటీతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ ఆశాదీపంగా మారింది. ఈ ఆరోగ్య ఫైట్‌లో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.