Sunday, February 8, 2026
HomeTop StoriesRenu Desai:బుద్దుందా మీకు..రేణు దేశాయ్ సీరియస్‌!

Renu Desai:బుద్దుందా మీకు..రేణు దేశాయ్ సీరియస్‌!

Renu Desai comments:దేశవ్యాప్తంగా వీధి శునకాల అంశం మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది. రోజుకో ఘటనగా కుక్క కాటు వార్తలు బయటకు వస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనకు కారణమయ్యాయి. వీధి శునకాలు కాటు వేయడం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, శునకాలపై అంత ప్రేమ ఉంటే వాటిని వ్యక్తిగతంగా తమ ఇళ్లలో ఉంచుకోవాలనే వ్యాఖ్యలు కూడా చేసింది. మనుషుల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

- Advertisement -

వీధి శునకాల ..

ఈ వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా వీధి శునకాల భద్రత, ప్రజల రక్షణ అనే రెండు అంశాలపై వాదనలు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి రేణు దేశాయ్ సోమాజిగూడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించి, కొత్త చర్చలకు దారితీశాయి.

Also Read: https://teluguprabha.net/cinema-news/director-ram-gopal-varma-viral-comments-on-dhurandhar2/

వందల సంఖ్యలో..

రేణు దేశాయ్ మాట్లాడుతూ ఒక కుక్క వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే లేదా కాటు ఘటన జరిగితే వెంటనే సమీపంలోని అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యను పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయని చెప్పారు. అయితే కొన్ని ఘటనల పేరుతో వందల సంఖ్యలో మాట్లాడలేని జంతువులను హతమార్చడం తనను తీవ్రంగా కలచివేస్తోందని అన్నారు. అన్ని కుక్కలు ప్రమాదకరమని భావించడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.

వీధి శునకాల సంరక్షణ..

తాను ప్రతిరోజూ అనేక వీధి శునకాల సంరక్షణలో భాగమవుతుంటానని, వాటికి ఆహారం అందిస్తుంటానని రేణు దేశాయ్ తెలిపారు. తన ఇంట్లో కూడా చాలా కుక్కలు ఉన్నాయని, అయినప్పటికీ ఎప్పుడూ కుక్క కాటుకు గురికాలేదని చెప్పారు. జంతువుల ప్రవర్తన మనుషుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, సరైన సంరక్షణతో చాలా సమస్యలను నివారించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిశుభ్రత ..

ఇక దేశంలో ఇతర సమస్యలపై కూడా ఆమె దృష్టి సారించారు. ప్రతి సంవత్సరం లక్షల మంది దోమకాటుతో వ్యాపించే వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. పర్యావరణ పరిశుభ్రత లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాల్లో కూడా అనేక మంది మరణిస్తున్నారని తెలిపారు. అయితే ఈ అంశాలపై పెద్దగా చర్చ జరగడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళలు, బాలికలపై..

సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై కూడా రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపై సరైన స్థాయిలో ప్రశ్నలు లేవని అన్నారు. ఇన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నా, ఒక్క వీధి శునకాల అంశమే అందరికీ కనిపిస్తోందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్నవారిని ఆలోచనలో పడేశాయి.

వీధి శునకాలను హతమార్చడం వల్ల నిజంగా సమస్య పరిష్కారమవుతుందా అని ఆమె ప్రశ్నించారు. జంతువులను చంపిన తర్వాత మనసుకు ఎలా ప్రశాంతత వస్తుందో అర్థం కావడం లేదని భావోద్వేగంతో మాట్లాడారు. మన ఇంట్లో తల్లి, చెల్లెలు వంటి వారు సురక్షితంగా ఉన్నారా అనే అంశాలపై కూడా సమాజం దృష్టి పెట్టాలని సూచించారు.

మద్యం దుకాణాలు..

ఇక నగరాల్లో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు విస్తరించి ఉన్నాయని రేణు దేశాయ్ విమర్శించారు. మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిపై మాత్రం పెద్దగా స్పందన లేదని అన్నారు. ఈ అంశాలన్నింటినీ పక్కనపెట్టి, కేవలం శునకాలపై మాత్రమే కోపం చూపించడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇది కలియుగమని, ధర్మాన్ని మనం కాపాడితే అదే మనలను కాపాడుతుందని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. ఒక కుక్క సాధారణంగా పదేళ్ల వరకు మాత్రమే జీవిస్తుందని గుర్తు చేస్తూ, ఆ తక్కువ జీవితకాలంలో కూడా దానిపై ద్వేషం చూపించడం ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలపై స్పందిస్తూ, శునకాలపై ఏదో కోపం ఉన్నట్టుగా అనిపిస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read:https://teluguprabha.net/cinema-news/anasuya-bharadwaj-repost-of-chinmayi-statement-on-rape-death-penalty-goes-viral/

కుక్క కాటు వల్ల ప్రాణం పోతేనే దానికి విలువ ఉంటుందా అనే ప్రశ్నను రేణు దేశాయ్ లేవనెత్తారు. ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, సమస్యకు మూలకారణాలను గుర్తించి పరిష్కారాలు వెతకాలని అన్నారు. కోపాన్ని జంతువులపై చూపించడం వల్ల సమాజం ముందుకు వెళ్లదని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News