బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali khan) ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్(Auto Driver)ను సైఫ్ కలిశారు. డిశ్చార్జి కావడానికి ముందు ఆసుపత్రిలో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. మరోవైపు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సైతం డ్రైవర్ సాయాన్ని మెచ్చుకుని ధన్యవాదాలు చెప్పారు.
ఆరోజు జరిగిన సంఘటను గురించి డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆటోలో వెళ్తున్న సమయంలో ఓ మహిళ ఖరీదైన నివాసం గేటు ఎదుట నిల్చొని సాయం కోసం చూస్తూ కనిపించిందన్నారు. తనను చూసి ఆటో ఆపమన్నారు. ఆటోలో ఎక్కిన తర్వాత ఆయన సైఫ్ అలీఖాన్ అనే విషయాన్ని గ్రహించానని తెలిపారు. ఆయనతోపాటు చిన్న పిల్లాడు, మరో వ్యక్తి ఆటోలో ఎక్కారని చెప్పుకొచ్చారు. సుమారు 10 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేరుకున్నామని.. ఆయన ధరించిన తెల్ల కుర్తా ఎరుపు రంగులోకి మారిపోయిందన్నారు. ఆస్పత్రి వద్ద ఆయన్ని దించి రూపాయి కూడా తీసుకోలేదన్నారు. అలాంటి సమయంలో సైఫ్‌కు సాయం చేసినందుకు ఎంతో సంతోషించానని భజన్ సింగ్ తెలిపారు.