Sarthak Sachdeva Fake Autographs: ముంబైలో యూట్యూబర్ సార్తక్ సచ్‌దేవా బాలీవుడ్ స్టార్ల నకిలీ ఆటోగ్రాఫ్‌లను అమ్మి ఒక్క రోజులో రూ.3,200 సంపాదించి సంచలనం సృష్టించాడు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి సెలబ్రిటీల సంతకాలను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌తో నకిలీగా తయారు చేయించి, వీధుల్లో ఒక్కొక్కటి రూ.100కి విక్రయించాడు. ఈ ప్రయోగాన్ని వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
సార్తక్ తన వీడియోలో, “సెలబ్రిటీల ఆటోగ్రాఫ్‌లతో ఎంత సంపాదించవచ్చో చూద్దాం,” అని చెప్పాడు. మొదట్లో కొందరు కొనడానికి సంశయించినా, బాలీవుడ్ క్రేజ్‌తో యువత, పిల్లలు, పెద్దలు ఆకర్షితులయ్యారు. “భారత్‌లో బాలీవుడ్ ఫ్యాన్స్ క్రేజ్ అద్భుతం. ఆటోగ్రాఫ్‌లు నిజమని నమ్మి అందరూ కొన్నారు,” అని సార్తక్ చెప్పాడు. రోజు చివరికి అన్ని ఆటోగ్రాఫ్‌లు అమ్ముడై, రూ.3,200 సంపాదించినట్లు తెలిపాడు.
సార్తక్ గతంలోనూ వివాదాస్పద కంటెంట్‌తో వార్తల్లో నిలిచాడు. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెస్టారెంట్ ‘తోరీ’లో ‘నకిలీ పనీర్’ సర్వ్ చేస్తున్నారని ఆరోపించాడు. అయోడిన్ టెస్ట్‌లో పనీర్ నల్లగా మారడంతో నకిలీదని ప్రకటించగా, రెస్టారెంట్ సోయా ఆధారిత పదార్థాల వల్ల ఆ రియాక్షన్ సహజమని వివరించింది. సార్తక్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 520K ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియో #SarthakSachdeva హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.

