Shriya Saran- Deepfake Videos :సీనియర్ హీరోయిన్ శ్రియ వృత్తిపరమైన నటనను ఆస్వాదించడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం అనగా 2001లో ‘ఇష్టం’ అనే తెలుగు చిత్రం ద్వారా ఆమె అరంగేట్రం జరిగింది. తెలుగుతో పాటు దక్షిణాది ఇతర భాషల సినిమాల్లోనూ, బాలీవుడ్ తో పాటు కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లోనూ ఆమె సందడి చేసిన సంగతి తెలియంది కాదు. వివాహానంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆమె నేటికీ నటనను కొనసాగిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ లో ఆమె ఓ ముఖ్య భూమిక పోషించిన ‘దృశ్యం- ది కన్ క్లూజన్’ చిత్రం ఇటీవలే విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
అజయ్ దేవగన్, టబులతో కలసి శ్రియ ఈ చిత్రంలో నటించారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రూ.480 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. దీంతో ఆ సినిమా ఇతర టీమ్ తో పాటు శ్రియ ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను చర్చిస్తూ, తన అభిప్రాయాలను సూటిగా తెలియజేశారు. తన పాతికేళ్ల నట ప్రయాణాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “2001లో ‘ఇష్టం’ సినిమాతో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మూడు సినిమాల వరకు అప్పట్లో కారవాన్ లు లేవు.
షూటింగ్ చేసే సమయంలో అందరం చెట్ల కిందే కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. తోటి ఆర్టిస్టులు, ఇతర యూనిట్ సభ్యులతో కలసి సరదాగా ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లం. షాట్ గ్యాప్ లో ఇష్టమైన పాటలు అందరం ఇనేవాళ్లం. కానీ అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీలో, దానికి తగ్గట్టు ప్రపంచం వేగం వైపు పరుగులు తీస్తుండటంతో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇయర్ ఫోన్లు పెట్టుకుని వారి వారి లోకాలలో ఉంటున్నారు. ఆర్టిస్టులకు స్టోరీ చెప్పే విధానంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మహిళా ప్రధాన చిత్రాల గురించి ఆమె మాట్లాడుతూ…ఆ తరహా కథా చిత్రాలు వస్తున్నప్పటికీ, వాటి వెనుక అంతా మగవాళ్లే ఉంటున్నప్పుడు ఇక మహిళల కమాండింగ్ ఏముంటుంది?. ఏదిఏమైనా చిత్ర పరిశ్రమలో మార్పు చోటుచేసుకుంటుండడం శుభపరిణామం అయినప్పటికీ ఈ విషయంలో ఇంకా ఎంతోదూరం ప్రయాణించాల్సి ఉంది” అని అన్నారు. ఇక ఏఐ టెక్నాలజీని ప్రస్తావిస్తూ…”దానిని మంచికి ఉపయోగించాలి తప్ప కొంతమంది దుర్వినియోగపరుస్తున్నారు.
డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలు సృష్టించి ఎంతోమందిని బాధపెడుతున్నారు. నేను కూడా గతంలో ఇలాంటి మార్ఫింగ్ వీడియో, ఫోటోల బాధితురాలినే. అసభ్యకరంగా దుస్తులు లేకుండా చూపే ఫేక్ మార్ఫింగ్ తీవ్రమైన బాధకు, మానసిక వేదనకు గురిచేస్తాయి. అందుకే అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మనం ఏం చేయాలన్నది తెలుసుకుని ముందుకు సాగాలి” అంటూ చెప్పుకొచ్చారు.

