Singer Mangli: గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ వరుస వివాదాల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్‌లో పెట్టుబడుల పేరుతో వందలమంది వద్ద నుంచి మంగ్లీ, ఆమె సోదరుడు, స్నేహితుడు మధులు కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు డబ్బుల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా ఆమె స్నేహితుడు మధు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేసులో ట్విస్ట్
ఇక ఈ కేసులో మంగ్లీ, ఆమె సోదరుడు కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. డబ్బు వెనక్కి అడిగిన వారిని బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆమె ఆడియోలు కూడా లీకవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మంగ్లీ సోదరుడు, ఆమె స్నేహితుడు మధు తమ వద్ద కోట్లలో డబ్బులు వసూళ్లు చేశారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మధు లొంగిపోయాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. మాకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనను మోసం చేశాడని, కంపెనీలో పెట్టిన సుమారు రూ. 20 కోట్లను ఆయనే తీసుకున్నాడని మధు ఆరోపించారు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరూ స్నేహితులని ఆయన పేర్కొన్నారు.
దయచేసి నా ఫోటోను వాడకండి..
ఈ వివాదంపై తాజాగా సింగర్ మంగ్లీ మీడియా ముందు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ‘మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా అమ్మనాన్నలే అతిపెద్ద ఎమోషన్. కానీ మీడియాలో, టీవీల్లో ఈ కేసుకు సంబంధించి నా ఫోటోలు వాడుతున్నారు. అవి చూసి వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయని, మీడియాలో చూపే విధానాన్ని బట్టే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.
తనని ఇలా తప్పుగా చూపించడం వల్ల సోషల్ మీడియాకు, కొందరికి వచ్చే లాభం ఏంటి? అని ఆమె ప్రశ్నించింది. తన పేరు చెప్పి కొందరు డబ్బు వసూలు చేశారని, వారిపై ఇప్పటికే కేసులు పెట్టామని ఆమె తెలిపింది. మోసపోయిన బాధితులకు తాను తప్పకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చింది. అలాగే ఈ వివాదంలో తన ఫోటోలను వాడోద్దని ఆమె వేడుకుంది. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే జైలుకు పంపండని, తాను ఏ తప్పూ చేయలేదంటూ కన్నీరు పెట్టుకుంది. అందరికీ నిజాలు తెలిసినా అసత్యాలు ప్రచారం చేయడం మా కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. మీ ఇంటి ఆడబిడ్డ అయితే ఇలా ఏడిపిస్తారా అని మంగ్లీ వాపోయింది.

