Singer Mangli: నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదంటూ మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తుంది సింగర్ మంగ్లీ. గతకొన్ని రోజులుగా ఆమె మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో మంగ్లీకి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆమెను ఉద్దేశిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు మంగ్లీ వెనకాల ఉండి.. తన సోదరుడు, స్నేహితుడు మధుతో ఈ కుంభకోణానికి ప్లాన్ చేసిందంటూ ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
మైక్రో ఫైనాన్స్ గురించి ఇప్పుడే వింటున్నా
అయితే, మొదటి నుంచి ఈ మైక్రో ఫైనాన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ చెబుతూనే వస్తుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె పోలీసుల స్టేషన్‌కు కూడా వెళ్లింది. అయినా, మంగ్లీపై ఆరోపణలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా స్పందించింద. ఈ మేరకు మంగ్లీ సోషల్ మీడియాలో వివరణాత్మక వీడియో విడుదల చేసింది. ‘మైక్రో ఫైనాన్స్ అనే పదం నేను ఇంతకు ముందెప్పుడూ వినలేదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం నన్ను, నా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నా వృత్తి పాటలు పాడటం.. కార్యక్రమాలు చేయడం మాత్రమే. అంతకు మించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు’ అని చెప్పుకొచ్చింది.
నాపై కుట్ర చేస్తున్నారు..
అనంతరం ‘నిజానికి నేను కూడా ఒక బాధితురాలినే. ఈ స్కామ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఆర్థికంగా నష్టపోతే నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నాను. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా మధునాయక్ నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమే.. కానీ అతని వ్యాపారాల గురించి నాకు తెలియదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశాను. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు’ అని మంగ్లీ వాపోయింది.
Also Read: Papam Prathap: ‘పాపం ప్రతాప్’కు సెన్సార్ బోర్డు షాక్.. ప్రీమియర్స్‌పై సందిగ్ధత
ఏనాడు తప్పు చేయలేదు
అలాగే తాను ఏనాడూ తప్పుడు పనులు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని మంగ్లీ ఉద్వేగానికి లోనయ్యారు. తన పేరు వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే దానికి తనకు ఏం సంబంధమని ప్రశ్నించింది. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని కోరింది. మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మంగ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాదానికి సంబంధించి త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

