ప్రముఖ సింగర్ మంగ్లీ(Mangli) టీడీపీ క్యాడర్ నుంచి తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లడమే ఇందుకు కారణం. వైసీపీ మద్దతురాలైన మంగ్లీకి టీడీపీ నేతలు ఎలా ప్రయారిటీ ఇస్తారని ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దీంతో తనకు అన్ని పార్టీలు సమానమేనని మంగ్లీ బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన కొందరు నాయకులు తనను సంప్రదిస్తే పాట పాడానని తెలిపారు. అంతేకానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదని వివరించారు. వైసీపీ ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానని గుర్తు చేశారు.
అసలు వైసీపీకి పాట పాడటం వల్ల తాను చాలా అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అందుకే 2024లో ఎన్నికల్లో ఏ పార్టీకీ పాటలు పాడలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి తాను పాట పాడను అన్నది అవాస్తవమన్నారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న చంద్రబాబుకు తాను పాట ఎందుకు పాడనని అంటానని వాపోయారు. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన పాటలకు రాజకీయ రంగు పులమొద్దని.. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని మంగ్లీ లేఖలో వెల్లడించారు.