సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) అభిమానులకు ఎట్టకేలకు నూతన సంవత్సరం సందర్భంగా ఓ గుడ్ న్యూస్ అందింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కున్న భారీ బడ్జెట్ మూవీ(SSMB 29) పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారని సమాచారం. ఇందులో చిత్రబృందంతో పాటు మహేశ్‌బాబు పాల్గొన్నారు. మొత్తానికి సినిమా ప్రారంభంపై మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు విడుదల చేయలేదు.
వేసవి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందట. రెండు భాగాల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. తొలి భాగాన్ని 2027లో.. రెండో భాగాన్ని 2029లో విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. అత్యంత భారీ బడ్జెట్‌తో అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ నటించనున్నారట. అలాగే హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని సమాచారం.
కాగా ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.