Mahesh Babu Ramayanam: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రామాయణం’ వంటి భారీ ప్రాజెక్టును వదులుకున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణం’ కథతో సినిమా తీయాలనుకున్న ఏ దర్శకుడికైనా, శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు మొదటి ఎంపిక అవుతారనడంలో సందేహం లేదు. ఆయన అందమైన రూపం, ఆకర్షణ ఆ పాత్రకు మరింత వన్నె తెస్తాయన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నితీష్ తివారీ కూడా తొలుత మహేష్ బాబునే సంప్రదించారని తెలుస్తోంది.
నితీష్ తివారీ ఆఫర్‌ను తిరస్కరించిన మహేష్?
నితీష్ తివారీ మహేష్ బాబుతో ‘రామాయణం’ కథ గురించి, శ్రీరాముడి పాత్ర గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. నితీష్ ఇచ్చిన ఆఫర్‌పై మహేష్ కూడా ఆసక్తి చూపినప్పటికీ, చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. అప్పటికే దర్శక ధీరుడు రాజమౌళితో సినిమాకు మహేష్ కట్టుబడి ఉండటం వల్ల, ‘రామాయణం’ కోసం కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ కారణంగానే మహేష్ నితీష్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి – మహేష్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత:
‘దంగల్’ వంటి పాన్-వరల్డ్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితీష్ తివారీ దేశంలోని ప్రముఖ దర్శకుల్లో ఒకరు. ఆయనతో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా వెనుకాడరు. కానీ రాజమౌళితో సినిమా అవకాశం ఉండటంతోనే మహేష్ నితీష్ ప్రాజెక్టును పక్కన పెట్టారని అర్థమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ హోదాను అనుభవిస్తున్నారు. ఆయన పాన్-ఇండియన్ మార్కెట్‌లో అపారమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ఆస్కార్‌ను భారతదేశానికి తీసుకొచ్చి ప్రపంచ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. అందువల్ల ఆయన మార్కెట్ రేంజ్ పాన్-వరల్డ్ స్థాయికి ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఇకపై రూ. 1000 కోట్ల నుంచి రూ. 2000 కోట్లు అంతకుమించిన వసూళ్లను సాధించగలవు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లు సులువుగా వస్తున్నాయి.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సమర్థుడు రాజమౌళి. అందుకే ఆయన ముందు వేరొక దర్శకుడిని నిలబెట్టడం కష్టం. ఈ కారణంగానే మహేష్‌కు మొదటి ప్రాధాన్యత రాజమౌళి ప్రాజెక్టే అని తెలుస్తోంది.
రణబీర్ కపూర్‌ను ఎంపిక చేసుకున్న నితీష్ తివారీ
మహేష్ తిరస్కరించిన తర్వాత నితీష్ తివారీ శ్రీరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్‌ను రెండో ఎంపికగా చేసుకున్నారు. అయితే, రణబీర్ కపూర్ ఎంపిక సరికాదని బాలీవుడ్ ప్రముఖ వెటరన్ నటులు కొందరు నిరాశను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, నితీష్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ రణబీర్ మాత్రమే కావడంతో, వెంటనే అతనికి అవకాశం కల్పించి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇటీవల ‘రామాయణం’ తొలి టీజర్ విడుదలైంది. నితీష్ శ్రీరాముడి పాత్రను లార్జర్ దెన్ లైఫ్ రేంజులో ఆవిష్కరిస్తున్నారని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.