Darshan: కన్నడ అగ్ర హీరో దర్శన్‌కు సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమైంది.
స్పెషల్ ట్రీట్‌మెంట్…
దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసు విచారణ తప్పుదోవ పట్టే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దర్శన్‌కు జైలులో ఎలాంటి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు అన్నది. త్వరలోనే దర్శన్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అసభ్య సందేశాలు పంపించాడని…
రేణుకాస్వామి హత్య కేసులో గత ఏడాది జూన్‌లో అరెస్ట్ అయిన దర్శన్ నాలుగు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాడు. నటి పవిత్రా గౌడకు అసభ్యకర సందేశాలు పంపించాడనే ఆరోపణలతో రేణుకాస్వామిని దర్శన్‌తో పాటు అతడి అనుచరులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి హతమార్చినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో హీరో దర్శన్, పవిత్రా గౌడతో పాటు మరో పదిహేను మందిని జూన్‌లో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వీఐపీ ట్రీట్‌మెంట్…
ఈ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న దర్శన్‌ను బెంగళూరులోని పరప్పన జైలుకు పోలీసులు తరలించారు. కానీ జైలులో అధికారులు అతడికి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. దాంతో బెంగళూరు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్‌ను మార్చారు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు దర్శన్. వెన్నునొప్పి, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు పిటీషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్‌లో దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత డిసెంబర్‌లో రెగ్యులర్ బెయిల్‌పై జైలు నుంచి దర్శన్ బయటకు వచ్చాడు.
అభిమానుల హర్షం…
దర్శన్ బెయిల్ రద్దును ఉపసంహారించాలని కర్ణాటక ప్రభుత్వం జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును తప్పుపడుతూ సుప్రీంకోర్టు గురువారం బెయిల్ రద్దు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

