Tammareddy Bharadwaj: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ మీట్‌లో ఇండస్ట్రీ అద్దం లాంటిది అని చిరంజీవి మాట్లాడిన మాటల వేడి ఇంకా తగ్గడం లేదు. చిరంజీవి మాటలకు వ్యతిరేకంగా చిన్మయి వేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. ఇంకా చాలా మంది కూడా చిరంజీవి మాటల్ని వ్యతిరేకించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, మగవాళ్లు ఆడవాళ్లని వేధిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే వీటికి అనుకూలంగా తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంద శాతం ఉందని ఆయన అన్నారు.
‘‘ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవ్వరూ వంద శాతం చెప్పలేరని, ఇండస్ట్రీలో మన జాగ్రత్తలో మనం ఉండాలని చిరంజీవి అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఇండస్ట్రీలో కచ్చితంగా వంద శాతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది. వంద శాతం అంటే.. అందరూ అలా చేస్తారు అని కాదు.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని మాత్రమే చెబుతున్నాను. ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. దగ్గరదగ్గరగా ఓ నలభై చిత్రాల్లో అదే జరుగుతుంది. కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ పేరిటే ఆ సినిమాల్ని తీస్తారు. పూర్వం రాజులు, జమీందారులు తమ మహిళల కోసమే సినిమాలు తీసేవారు.
ఇండస్ట్రీలో మా తరానికి వచ్చే సరికి ఓ పది, ఐదు శాతం ఇలాంటి బ్యాచ్ ఉండేది. ఇప్పుడు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్‌లు, పెద్ద దర్శకుల్లో దాదాపు ఒక శాతం వరకు ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉన్న వారిని ఎవ్వరూ ఆపలేరు. మనం ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటే కొన్ని కష్టాలు వస్తాయేమో. కానీ మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ తరంలో అందరూ చిన్మయిని స్పూర్తిగా తీసుకోవాలి. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించి నిలబడ్డారు. ఆమెను ఎన్ని రకాలుగా భయపెట్టినా, బ్యాన్ చేసినా ఆమె తన పోరాటాన్ని ఆపడం లేదు.
ఎవ్వరికీ వంగకుండా, బెదరకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని మాత్రం చెప్పడం కష్టం. చాలా మంది పరస్పర అంగీకారంతో చేసుకుంటున్నారు. పరిస్థితులు కూడా చాలా మారాయి. అన్ని పరిశ్రమల్లో, వ్యవస్థల్లో ఆడవాళ్లని వస్తువులుగా చూసే పరిస్థితులున్నాయి. అంతగా లేదు అని చిరంజీవి చెప్పడం వెనకలా ఇండస్ట్రీ సేఫ్ అని, ఇండస్ట్రీలో అలాంటివే ఉండవని, నో మీన్స్ నో అన్నట్టుగా ఆయన చెప్పారు. కానీ ఆ తరువాత కూడా వేధిస్తే మాత్రం చాలా తప్పు. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇండస్ట్రీలో రకరకాల సమస్యలున్నాయి. అందరం కలిసి ఇలాంటి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.
Also Read- Maa Inti Bangaram: సమంత ‘బంగారం’కు రేటు చాలా ఎక్కువే?

